There's much to explore in life , and one of the ways is reading . Whats better to read than words and sentences that rhyme !
Find out about culture,perspective and many more,through the pen of my Grandma !
Subbamma is a perfect bridge between the baby boomers and the Gen X
A silent observer and a keen listener who is the eldest of all her siblings and cousins put together has found her expression through the words she love from her mother tongue Telugu.
An epitome of grace with a shield of dignity coupled with humility, Subbamma’s learning is from life where her world is her family.
Explore the world of a humble Indian home maker to see the world from her view through her words!
కరోనా!కరోనా!కరోనా!
లోకమంతా కోడై కూస్తోంది! కరోనా!కరోనా!కరోనా!
నదురెందుకు బెదురెందుకు, నడుంకట్టి ఆగుదాం!
నాటి లక్ష్మణ రేఖ ఈనాటి మన జీవనరేఖ!
అవగాహనే మన ఆయుధం!
ఆచరణే మన ధ్యేయం!
అనుకుంటే కాదేదీ అసాధ్యం!
పోరాటానికి మొదటి అడుగు ఒంటరే!
ఒంటరిగా మనం ఇంట ఉందాం!
ఏకత్వమే ఈనాటి మన ఐకమత్యం!
మరో చేతికై నీ చేయి చాచకు!
నీ చేతులు రెండూ కలిపితే అదే నమస్కారం!
నమస్కారం మన సంస్కారం!
విశ్వమంతా చెప్పేను ఈ విషయం!
మేరా భారత్ మహాన్ ! జై హింద్!
ఆడబిడ్డను నేనురా !
అలుసు సేసి సూడబోకురా !
పేమపంచేటోళ్లు అక్కసెల్లెల్లు ,
ఆడబిడ్డలేనురా !
ఇంట దీపమెట్టె ఆలి కూడా ఆడదేరా!
పొలిమేర నిను కాసేటి పెద్దమ్మ ,
ఆడదేనని మరువకురా !
కట్టమొస్తే నువు మొక్కేటి సామి,
ఆలి మాటే వింటాడురా !
ఉసురు పోతే ఫిఖరు లేదు,
నొప్పులెన్నొలెక్కలేదు,పురిటి నెప్పులోర్చిఉపిరి నీకిచ్చెరా !
నిన్ను సూసి మురిసెరా!
కట్టమంతా మరిచేర,
మాట సెప్పే, నడక నేర్పే,
లోకమేంటో సెప్పెరా,
ఓర్పు, నేర్పు, ఓదార్పు అమ్మకుండేటి అస్థిరా
కడుపులోనే గొంతు నులిమివేస్తే అమ్మ నీకు ఏదిరా !
అమ్మ లేకపోతే నీకుఉసురు ఏదిరా !
అమ్మ ఋణము నువు తీర్చలేవురా !
మనసుతోటి నువు బతకరా !
మడిసిగా ఎత్తు ఎదగరా !
అమ్మ దీవెన నీకుందిరా !
శివ శివ శంకర !
మూడు కళ్ళు నీకంట !
లోకమంత నీవంట!
నెత్తి మీద గంగమ్మ, ప్రక్కనుంది చంద్రమ్మ !
నాగుపాము నీకు నగ అంట!
నీవు గరళ కంఠుడివంట !
బూడిదే నీకు వలువలంట !
ఊరి అంచు నీ కొలువంట !
నీది కాని చోటుందా !
నీకు తెలీని ఉసుందా !
తుమ్మితే రోగం ! దగ్గితే రోగం !
అంటుతున్న రోగం - అందరికి !
మందు లేదు, మాకు లేదు !
బిక్కు బిక్కు మంటు దిక్కు తోచని జనం !
ఏమవుతుందో అనే భయం !
తమకు తామంటేనే భయం !
ఏమైనాదొ ఏమో వొచ్చింది మాయరోగం !
ఎతుకులాట మొదలాయేరా !
దారి నీవే చూపరా!
మనిషి ఏకాకి - బ్రతుకు ఏకాకి !
అనాధలుగా రాలిపోతున్న జనం !
సాయమందించినా వొస్తుంది చావు !
చీమ కూడా చావదే నీ ఆన లేనిదే !
సీమను కాపాడ లేవా శివయ్యా !
వల్లకాటిలో నీ అభయం శివా, కావాలి కరోనాకి భయం !
శివ శివ అని పాడతాం చేతులెత్తి మొక్కుతాం !
అందుకోవయ్యా, ఆదుకోవయ్యా అయ్యా శివయ్యా !
తెలుగు భాష నీదిరా !
తుషార ధారరా !
తేనెలూరు యాసల పూలతో కట్టిన కదంబం !
కావ్యాలకు కమనీయం !
నన్నయ్య ,తిక్కన ,ఎఱ్ఱాప్రగడల భారతీయనువాదం,
(మహా భారతం ) మహనీయం !
పోతన్న భాగవత తెలుగు సేత !
మనవైన సిరులు ,మనకున్న ఒనరులు !
అన్నమయ్య లాలిపాట !
పసిపాపల జోలపాట !
రామదాసు భక్తి, త్యాగయ్య కృతి,సంగీతాకృతులు !
అక్షర మాలకి ఏబది ఆరు అక్షర సంతతి !
అచ్చులు ,హల్లులు విభజన ఎంతటి సౌకర్యం !
దిత్వాక్షరాల దిటవు, గుణింతాల ఒంపు సొంపులు, అలంకారాల హొయలు లయలు !
"య మా తా రా జ భా న స ల గం",
సిరి గల ఛందస్సుతో !
పద్య రూపాలెన్నో ,రూపాంతరాలెన్నెన్నో !
ఎంతటి సంపన్నురాలో నీ తెలుగు భాష !
"ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్ " అన్న విదేశీయుల సత్కార ముత్యాల మాల జిలుగు వెలుగుల మెరిసే
తెలుగు బాల !
"దేశభాషలందు తెలుగు లెస్స" అన్న రాయల కీర్తికిరీటం !
ఘనకీర్తి గల వీణావాణి !
తెలిసినవి కొన్ని తెలియనివి ఎన్నో భాషలు అజ్ఞాతం
ఐన సంగతి విదితమేగా !
దేశాలెన్ని తిరిగినా , భాషలెన్ని నేర్చినా
నీ ఉనికిని చాటే నీ తెనుగు తల్లిని విడనాడకు ....విడనీయకు !
దశ లెన్ని మారినా, దశాబ్ధాలెన్నైనా
మరువకు నీ మాతృభాషని !
తరాలు మారినా ,కాలాలు మారినా,
నిలవాలి నీ భాష కలికితురాయిగా !
బ్రతుకు ఒక వరం !
అమ్మకు నీవే ప్రాణం !
బుడిబుడి అడుగుల బుడతవి !
జిలిబిలి పలుకుల చిలకమ్మవి !
అమ్మ ఒడిలో చందమామవి !
మా ఇంట నీవు యువరాణివి !
విశ్వం ఒక విచిత్ర వలయం !
సమస్యల మయం !
చేధించు ,సాధించు !
జీవితం ఒక చదరంగం !
ఎత్తులు పైఎత్తులు !
ఓర్పుతో ,నేర్పుతో
ఆడి గెలిచేయ్ !
బ్రతుకుఆటుపోట్ల సంద్రం !
భయమెందుకు వెనకడుగెందుకు!
పొంగక ,కృంగక నడు ముందుకు !
అడుగు తడబడితే మాట పొరబడితే !
సవరించుకో ,సరిదిద్దుకో !
స రి గ మ ల ఒరవడిలో !
ఆకసాన దారనై !
ఉరికి ఉరికి ఉప్పొంగి !
హిమగిరిని తాకి !
చల్లగా తెల్లగా ఎగిసెగిసి !
కొండలలో పారి కోనలని తాకి !
సొగసులన్నీ నాకే సొంతం !
హొయలు లయలు నాకందం !
నేనుంటే పచ్చదనం సృష్టికెంతో చల్లదనం !
పాయనౌతా పసిపాప నవ్వులా !
వానోస్తే పొంగుతా వరదనై సాగుతా !
సాగుతూ పారి పారి !
ఈశుని పాదాలు చూసా !
ఒడిసిపట్టిన విశ్వనాథుడు సిగను చుట్టి మురిసే !
అర్ధనారీశ్వరుని సతినై !
శిరస్సున చిందులు వేశా !
గంగని నే శివగంగని !
పవిత్రాత్మల సింధుని !
ఒకేసారి బ్రతుకు !
మనసారా బతుకు !
నిన్న తిరిగి రాదురా !
నువ్వు మరిచి పోకురా !
నేడు నీ సొంతమురా !
రేపు అన్నది ఆశరా !
ఆశే నీ ఊహలకు దివ్వెరా !
నేడు రేపటి నిన్నరా !
తరచి తొంగి చూడరా !
మంచీ , చెడు నేర్పురా !
నిత్య విద్యార్థివి నీవై !
నిన్ను నీవు తెలుసుకో !
శిల్పంగా మలుచుకో !
గతము గురువైతే !
గగనమైనా నీకు చెరువే !
ఎంత ఎదిగినా!
ఒదిగితేనే వినయం !
వరిస్తుంది విజయం !
నాన్న అనేవి రెండే అక్షరాలు !
ఆ అక్షరాల అంతరంగం అనంతం , అమోఘం !
ఎన్నో ఎన్నెన్నో నిధినిక్షేపాల గని !
నా జన్మ చూసి మురిసాడు !
నా నవ్వే తన నవ్వుగా తలిచాడు !
నన్ను తానుగా మలిచాడు !
తనని నేను మించాలని ,
ఉన్నతంగా నను చూడాలని
తనని తానే మరిచాడు !
నిరంతర ప్రయత్నములో నిత్యశ్రామికుడు !
నిలువెత్తు నిస్వార్ధ ప్రేమికుడు !
అపజయానికి వెరవకు !
అది విజయానికి నీవు వేసుకున్న పునాది !
అని చెప్పిన హితుడు !
వెన్ను తట్టిన స్నేహితుడు !
విజయం అంటే బాధ్యత !
వినయానికి అది బానిస !
ఏ కష్టం కాదు శాశ్వితం !
వెంటే వస్తుంది సుఖం !
కూడగట్టుకో నీ ఆత్మస్థయిర్యం !
కనిపించే ను కాంతి మార్గం !
తలచి తెరచి చూస్తే
ఈ నాటి నేను
నాన్న దిద్దిన శిల్పం !
ఆడపిల్లగా జన్మనెత్తి !
అమ్మవై జన్మనిచ్చి !
అక్కగా ఆదరించి !
చెల్లివై ప్రేమని పంచి !
భార్యగా తోడు నడిచి !
సృష్టికే కొత్త అందాలు పొదిగిన బ్రహ్మవి !
వనితా. నీకు వందనం .... ఓ అతివ అభినందనం!
"ఆదిశక్తివి నీవు"
లేదమ్మా నీకు సాటి .... ఎవరమ్మా నీకు పోటీ ?
ప్రేమ నీ చిరునామా అయితే !
సహనం నీ సంతకం !
క్షమాగుణం నీ నైజమైతే !
ఓదార్పుకు నెలవు నీవు !
ఎక్కడిదమ్మ ఇంతటి వైనం !
అందుకే ఇలను నీవు దైవం !
నీ కమ్మని గొంతు విప్పకపోతే !
లేదుగా లాలి పాపకు !
పలుకు నీవు నేర్పనినాడు !
ఏదమ్మా ఓంకారానికి శ్రీకారం !
నడక ..నడత నేర్పకపోతే !
ఉందా ఈ జగతికి జాగృతి !
ఓ మహిళా నీ ఎద పరచకపోతే
ఏదమ్మా తావు సేద తీర !
సృష్టికర్త బ్రహ్మ ...ధర్మకర్త అమ్మ !
నారి నవరత్న హారమా !
అందుకో మా అంజలి ...మనస్సుమాంజలి !
(మహిళా దినోత్సవ సంధర్భముగా మహిళలందరికీ
నా ఈ అక్షరమాలార్పణ)!
రామా శ్రీరామ రఘుకులతిలక రఘురామా !
పాయసాన బుట్టిన పరంధామా!
చందమామ నడిగిన చిన్నికునా శ్రీరామా!
యాగమును కాయ ముని వెంట నేగిన
రాక్షస సంహార సాకేతరామ !
రాతిని నాతిని జేసిన పురుషోత్తమా!
శివధనుస్సునిరిచి సీతని చేపట్టిన సీతారామా!
పోకల దమ్మక్క భక్తి , కృషీవలుడు కంచెర్ల గోపన్న శక్తీ కలిసి వెలిసిన నీ భద్రాద్రి భద్రాచలరామా !
గోపన్న ఆవేదన ఆక్రందన ఆకృతులేగా నీ కీర్తనలు !
నేటికినీ కొనసాగుతున్న సంకీర్తనలు !
హనుమ హృదయం నీకు ఆలయం !
నీ ఆలయమే రామదాసుని నివాసం !
నాడు నీ జననం బెట్లుండెనో నే చూడనైతి స్వామీ!
నాడు నే రాతినో ...నాతినో, కోతినో ....కొమ్మనో,
పక్షినో ...పచ్చికనో జన్మంబేదో ఎరుగనిదానా !
నేటి నీ జన్మభూమిన జరిగిన ఆలయస్థాపన
కనీ విని తరించే నా జన్మ !
ఆబాలగోపాల మంతయు జేరి
చేసిన సందడి ప్రతి గుండెలో మ్రోగే నగారా ధ్వని !
వనితల చేతి గాజుల సవ్వడులు తలపించే మువ్వల ఝరి !
కోమలాంగుల పకపకాలు ,ముసలిముతకల రామనామ జపమున వినవచ్చే సన్నని సన్నాయి రాగాలు !
నీ చరిత గానాలు నీ నడత కీర్తనలు మనసున పలికించే వేణుగానాలు !
స్వర్గమే ఇల చేరినట్లుండే !
రమణులందరూ గూడి రంగవల్లులు దిద్దంగా!
తరుణులంతా చేరి గడప గడప తోరణాలు గట్టంగా
చిన్నపెద్దలంతా వీధివీధినా జేరి చేసిన కోలాహలం
కన్నెమణులాడు కోలాటాల లయలు ..శ్రుతులు !
రామరాజ్య తీరు ఎంత సుభిక్షమో అనిపించే !
ఇంటింట వెలిగిన దివ్వెల వెలుగులు !
సరయు నదిని లక్షదీపాల ప్రజ్వలన జిలుగులు !
అంబరాన చుక్కలన్నీ భువిని ముద్దాడినట్లనిపించే
రమణీయమైన నీ ఈ సంబరాలు జూడ !
నా రవ్వంత పుణ్యంబేనాటిదో చూసి తరించితి తండ్రి !
ఇంతటి మహద్బాగ్యం నాకొసిగిన రామా!
నేనేమివ్వగలదాన నీ నామ జపము తప్ప !
జయ జయ రామా....జానకి రామా !
సీతారామ సీతా మనోభిరామా !
ఓ మనిషి నీకెందుకింత విర్రవీగుడు !
రాకపోకలు నీ చేత లేవని తెలుసా ?
జగతి నీ సొంతమా ,ఎందుకింత పంతము !
నీ ఈ అరాచకానికి లేదా అంతము !
చమురు ఉందంటూ కడలిని చిలికావు!
నోరులేని జీవులలెన్నింటినో మటుమాయం చేసావు
అడవులని నరికావు అలంకారాలు చేపట్టావు !
చెరువుల్ని పూడ్చావు భవనాలు కట్టావు !
నీటి వొరవడి ,అవసరం నాకనవసరం అన్నావు !చెట్టు చేమని కొట్టావు పిట్టలెన్నింటినో మటుమాయం చేసావు !
పరిశ్రమలు తెచ్చావు పురోగతి అన్నావు !
నీటినంత కాలుష్యం నింపావు !
నేలతల్లిని మట్టుబెట్టి చాలదంటూ నీవు నింగికెగిరినావు !
ధూళినెంతో నింపి కాలరీతులనే మార్చినావు !
పంట భూములను బంజరులుగా మార్చావు !
గింజ లేని నాడు తిండి ఉండదన్న విషయమే మరిచావు !
రైతన్న చావుల్ని పైసలతో పూడ్చావు !
పసిపాప కధల మూట చంద మామ !
కన్నెపిల్లలు కలల పాట చందమామ !
కాదంటూనే కాలు మోపావు మామ మీద !
మట్టి ఉందన్నావు మంచు ఉందన్నావు !
రాయిరప్పలు తెచ్చావు వ్యాపారానికే వేశావు వారధి
నిలకడ లేని , నిలబడలేని చోట నేలనమ్మావు !
ఏమిటీ అహంకారం ఎందుకింత ధిక్కారం !
నీరు , నిప్పు ,గాలి ,కొండలు కోనలు, చెట్టూచేమలు,
పశుపక్షులు పుడమితల్లి ముద్దుబిడ్డలు !
అవి నీకు ఎన్నో నేర్పాయి మరెన్నో ఇచ్చాయి ఇస్తూనే ఉన్నాయి !
ఆ నిస్వార్థ తత్వానికి నీవెంత ? నీవెక్కడ ?
ఈ జగతికి నువ్వో అతిధివన్నా సత్యాన్నే మరిచావు !
స్వార్ధాన్ని వీడి సత్యాన్ని గ్రహించు !
మంచిని పంచు ,మమతని పెంచుకో !
నీ ఉనికిని నిలుపుకో !
ప్రేమించు ప్రేమని పంచు
కాదేది శాశ్వితం ,రాదేది నీతో !
నీ చరిత ముగిసినా మిగిలేను నీ మంచి అజరామరమై !
పుట్టుక మారెనా, పెంపకపు వరస మారెనా !
బలవర్ధకపు ఆహారమనుచు
నడుమ చేరిన సిరిలాకులు ,
పీడియా షూర్లు ఎన్నో మరెన్నో !
పేరులో కొత్తదనం చూసి మురిసిన తల్లులు కోకొల్లలు !
కొత్తొక వింతన్నట్లు వింతని వలచిన వనితల జోరు !
అందుకందిగా వ్యాపారాల జోరు!
జీర్ణశక్తికై పిల్లలకు వాడే గ్రైఫ్ వాటర్ ,
మిల్కోఫ్ మెగ్నీషియం ,
నాటివే నేటికినీ వాడుతుండిరి కదా!
అక్షరాబ్యాస ఓ న మా ల వరస ,
ఆపై దిద్దిన అక్షర మాల
దిద్దక మానితిమా వద్దని ఆపితిమా !
పర భాష వ్యామోహముతో పలికితిమి కదా ఆహ్వానం ఆంగ్లమునకు !
అనుసరించెకదా విద్యాలయములన్ని ఆంగ్ల మాధ్యమాన్ని !
ఆపై జత చేరెను అంతర్జాతీయ పాఠశాలల తీరు !
“ హః హతవిధి "
తల్లితండ్రుల బ్రతుకు పరుగుపందెమాయె !
భోదించు విధానాలు మారినన్,
సారాంశమదియేనన్న సత్యము మారుగాయె కదా !
నాటి టైపు మిషన్ ఏ బి సి వరసే కదా ,
నేటి కంప్యూటర్ కీ బోర్డు !
వసతుల పేరిట వంట గదుల పోకడలు మారినన్ !
నూడిల్స్ ,పిజ్జాలు ,బర్గర్లు అనే విదేశీ వంటకాలు
ఎన్ని వచ్చినన్!
ఆవకాయిని విడిచితిమా గొంగురని వదిలితిమా !
దద్దోజనమున నిమ్మ బద్ద నంజుడు ఆపితిమా !
పథ్యమన్న చింతకాయ దంపుడు ,ఇడ్లీ లో కారప్పొడి ,అట్టుకి పచ్చిమిరప పచ్చడి రుచులని
మరువగలమా ,మరిచితిమా !
ప్రకృతి కాలుష్యము న సహజత్వం తగ్గినను ,
రూపాంతరము న వాసనలు అటునిటు నైనను ,
మనసు కోరేది వాటినే కదా !
గుండెల్లో నిండిన వాటిని రూపుమాప తరమా!
క్రొత్తదనములో కొంగ్రొత్తలు నెన్నింటి నైనా ,
తను మమేకమయ్యే
నవనీత తత్వం ,అదియే పాతకు స్థిరత్వం !
భవితకై నవ్యత అద్దిన సొగసులతో!
ఇలను అలరించే పాలపుంత ఈ పాత !
చింతకాయ పచ్చడిని ఆస్వాదించే మనకు
పాత మీదేలా ఈ సీత కన్ను !
పాత ఓ పునాది భవితకి ఆధారం !
మన ఊరు మారేరా ,దాని ఉనికి మారేరా !
అందాలు పోయేరా,ఆనందాలు యేమాయెరా !
సంకురేతిరి వస్తే పేడతో అలికేటి వాకిళ్లు !
రంగురంగున బెట్టి దిద్దేటి ముగ్గుల్లు!
ముగ్గుల్లా మురిపించు సొగసైన గొబ్బిళ్ళు !
హరిదాసు చిడతలు చేసేటి భజనలు !
(హరిలో రంగ హరి )
గంగిరెద్దుల వాడు వినిపించు సన్నాయి రాగాలు !
ముద్దుగుమ్మలు తిరిగే ఒప్పుగుప్పులాటలు !
గుమ్మాల బంతులు సెప్పేటి ఊసులు !
భోగినాడు భామలు తట్టే సందె గొబ్బిళ్ళు !
మూడునాళ్ళ ముచ్చట్ల బొమ్మల్లా కొలువుల్లు!
అంబరాన పతంగుల జోరు తలపించే విహంగాల తీరు !
ఏటేటా జరిగే రామయ్య పెళ్లి !
వీధివీధికో పందిరి ఊరంతా సందడి !
ఏమాయె ఆ తీరు ఎటుపోయే ఆ జోరు !
పొలిమేర కాపున్న పోలేరమ్మతల్లి !
జాతరొచ్చిందటే ఊరంతా హుషారు !
చద్ది నెత్తికెత్తి ప్రభలు సాగు తీరు !
ఆ ఆచారమెటుబోయెరా !
అదిక మన దరిచేరబోరాదురా !
దసరా పండుగ నాడు బడి పిల్లలు పాడేటి పద్యాలు ఎటోవెళ్లిపోయే !
పప్పుబెల్లా పంచుడు పటాపంచలైపోయే !
అయ్యవార్లకు ముట్టు ఐదు వరాల మూట,
ఎటుబోయెరా యేమాయెరా !
తాత ,మామ పిలుపులు తలపుల చాటుకెళ్ళె !
పిన్ని వదిన వరసల అభిమానము అటకెక్కిపోయే !
బంధాల భావాల విలువలే మారే !
కానగంతాల తోటి కాసు చుట్టూ తిరుగాడే !
పదిహేను పదుల వెనుక కట్టిన భవనమదిరా!
ఊరికే ముందు ఊరంతా గుర్తింపు !
తాతగారి పేరు వీధి పేరుగ నిలిచి కొండలరావు వీధిగా వేసింది తిష్ట !
తిమ్మన వారికది ఎంతో ప్రతిష్ట !
తెలిసున్న వారికది ఓ చరితం !
తెలియని వారికది సామాన్యం !
మార్పు సహజమంటూ మంచి జరుగునంటూ నేలకూల్చినారు సర్కారు వారు !
గుండెల్లో గుబులు ,కళ్ళల్లో నీళ్ళు !
అసహాయతకు ఆనవాళ్ళు !
ఆ నాటి ఆ తీరు మరలిరానిదిరా !
మనకు మరువలేనిదిరా !
Copyright © 2024 Subbu's Reflections - All Rights Reserved.
Powered by GoDaddy Website Builder